6.jpg)
తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు శుభవార్త! నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పీఆర్సీకి ఆమోదముద్ర పడింది. వచ్చే నెలలో చెల్లించబోయే జీతాలలో 30 శాతం పెంపును వర్తింపజేసి చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏప్రిల్, మే నెలల బకాయిలను కూడా జూలై 1వ తేదీన చెల్లించబోతోంది.
2020 ఏప్రిల్ 1 నుంచి 30 శాతం పీఆర్సీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినందున, అప్పటి నుంచి 2021, మార్చి 31 వరకు చెల్లించాల్సిన బకాయిలను 36 వాయిదాలలో చెల్లిస్తుంది. అంతకు ముందు కాలానికి అంటే 2018, జూలై 1 నుంచి 2020, ఏప్రిల్ వరకు చెల్లించాల్సిన మానిటరీ బెనిఫిట్స్‌ను కూడా నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించింది.
పెన్షనర్లు, కాంట్రాక్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు:
ప్రభుత్వోద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా ముప్పై శాతం పీఆర్సీ అందుకోబోతున్నారు. అయితే బకాయిలను ఒకేసారి కాకుండా 36 వాయిదాలలో పొందుతారు. అలాగే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జూలై నెలలో పెంచిన జీతాలు అందుతాయి. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కలిపి మొత్తం 9,21,037 మంది లబ్ది పొందనున్నారు.
ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలలో కొంత మొత్తాన్ని ప్రభుత్వం వారి ప్రావిడెంట్‌ఫండ్‌లో జమా చేసి కొంత నగదు రూపంలో అందజేస్తుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టం (సీపీఎస్)లో బకాయిలను నగదు రూపంలో వాయిదాలలో చెల్లించనుంది. ప్రభుత్వం దానిని ఎన్ని వాయిదాలలో చెల్లించబోతోందో త్వరలో ప్రకటిస్తుంది.
హెచ్ఆర్ఏ మీద పరిమితిని తొలగించి, కేజీబీవీ ఉద్యోగులకు ఇకపై 180 రోజుల ప్రసూతీ శలవును మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
జూలై 1వ తేదీన ఉద్యోగులందరికీ పెంచిన జీతాలు చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని సిఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించారు.