ఆ వరాలే అన్నాడీఎంకెకి శాపాలు

ఏప్రిల్ 6వ తేదీన తమిళనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా రాజకీయపార్టీలు మ్యానిఫెస్టో పేరిట ప్రజలకు వరాలు ప్రకటిస్తున్నాయి. తమిళనాడులోని అధికార అన్నాడీఎంకె, బిజెపిలు కలిసి పోటీ చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో ప్రజలు తీవ్ర ఆగ్రహం, అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే. కనుక ఆ ప్రభావం అన్నాడీఎంకె, బిజెపిలపై తప్పక పడుతుంది. 

ఈ సంగతి ముందే కనిపెట్టిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకె ఈరోజు తన మ్యానిఫెస్టోలో వాటి ధరలు తగ్గిస్తామని ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్‌పై లీటరుకి రూ.5, డీజిల్‌పై రూ.4, అలాగే ఆవిన్ పాల ధరను లీటరుకు రూ.3 తగ్గిస్తామని ప్రకటించింది. వంటగ్యాస్ సిలెండర్‌పై రూ.100 రాయితీ ఇస్తామని ప్రకటించింది. మహిళలకు 12 నెలలు ప్రసూతి సెలవు ఇస్తామని, ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో విద్యార్దులకు ఉచితం ట్యాబ్‌లు అందజేస్తామని డీఎంకె పార్టీ హామీ ఇచ్చింది. 

ఇప్పటికే అధికార అన్నాడీఎంకె పాలనపై తమిళ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ఈసారి డీఎంకె పార్టీని గెలిపించబోతున్నారని సర్వేలన్నీ తేల్చిచెప్పాయి. ఇప్పుడు డీఎంకె పార్టీ ప్రకటించిన ఈ వరాలు సామాన్య ప్రజలను చాలా ఆకట్టుకొంటాయి కనుక అవే అన్నాడీఎంకె, బిజెపి కూటమికి శాపాలుగా మారి వాటి ఓటమికి దారితీయవచ్చు. ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటీకరణ నిర్ణయం కూడా వాటి పాలిట మరో శాపంగా మారే అవకాశం ఉంది.