భైంసా ప్రజలను మేము కాపాడుకొంటాము: బండి సంజయ్‌

నిజామాబాద్‌ జిల్లా, భైంసా పట్టణంలో ఇటీవల జరిగిన అల్లర్లలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. మరికొంతమంది గాయపడ్డారు. ఆ బాలికను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన బాధితులను యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈరోజు గాంధీ, యశోదా ఆసుపత్రులకి వెళ్ళి వారిని పరామర్శించారు. 

అనంతరం  మీడియాతో మాట్లాడుతూ, “మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకపోగా, ఈ విషయం బయటకు పొక్కనీయవద్దని బాధితురాలి కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. పైనుంచి వస్తున్న ఒత్తిళ్ళతో పోలీసులు తమ పని తాము చేసుకోలేకపోతున్నారు. ప్రజలందరినీ సమానంగా చూడవలసిన ప్రభుత్వం.... పోలీసులు భైంసాలో ఒక వర్గం ప్రజలకు అనుకూలంగా చూస్తుండటం చాలా బాధాకరం. భైంసాలో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. టిఆర్ఎస్‌ ప్రభుత్వ తీరును...పోలీసుల తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ భైంసాలో ప్రజలకు భద్రత కల్పించలేకపోతే మేమే పూనుకోవలసి వస్తుంది. భైంసాలో ప్రజలను మేము కాపాడుకొంటాము. ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే నేను భైంసాకి వెళ్ళి బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి అవసరమైన సహాయసహకారాలు అందిస్తాను,” అని అన్నారు.