మళ్ళీ టిఆర్ఎస్‌తో దోస్తీకి మజ్లీస్‌ సై

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు వరకు చెట్టాపట్టాలేసుకొని పనిచేసిన టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలు ఎన్నికల ప్రచారం మొదలవగానే బద్ధ శత్రువులలా పరస్పరం కత్తులు దూసుకొన్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపి మత ప్రాతిపదికన ప్రచారం చేసి హిందూ ఓటు బ్యాంకుని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తుందని గ్రహించినందునే, ముందు  జాగ్రత్త చర్యగా టిఆర్ఎస్‌-మజ్లీస్‌ పార్టీలు ‘తలాక్’ చెప్పుకొన్నాయి. కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి కనుక మళ్ళీ దోస్తీకి సిద్దపడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందన వింటే ఆ విషయం అర్దమవుతుంది. అయినా ‘జబ్ మియా బీబీ రాజీ హైతో క్యా కరేగా ఖాజీ” (మోగుడూపెళ్ళాం రాజీపడినప్పుడు మద్యవర్తికి ఏం పని? అని అర్ధం) అన్న్త్లు టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలు మళ్ళీ చేతులు కలిపి పనిచేసుకొంటామంటే ప్రజలు, ప్రతిపక్షాలు మాత్రమే ఏమి చేస్తాయి?   

అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ, “నేను కేసీఆర్‌ను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను.  దక్షిణ భారత్‌లో మంచి రాజకీయ భవిష్యత్‌ ఉన్న ఏకైక నాయకుడు సిఎం కేసీఆర్‌.  బిజెపిని ఎదుర్కోగల ఏకైకనాయకుడు సిఎం కేసీఆర్‌ మాత్రమే. ఆయన పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అద్భుతంగా ప్రగతి సాధిస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపి మతం పేరుతో ప్రజల మద్య చిచ్చు పెట్టి లబ్ది పొందాలని ప్రయత్నించింది. బండి సంజయ్‌ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటే పాతబస్తీ ప్రజలు బిజెపిపై డెమోక్రటిక్ స్ట్రైక్ చేసి బిజెపికు గట్టిగా బుద్ది చెప్పారు. సాక్షాత్ కేంద్రహోంమంత్రి అమిత్ షా, యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చి ఎన్నికల ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదు. ఇక్కడ బిజెపికి చోటు లేదని తేల్చి చెప్పారు. మేయర్, డెప్యూటీ మేయర్ పదవుల గురించి శనివారం పార్టీలో అంతర్గతంగా చర్చిస్తాము,” అని అన్నారు.