జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఓట్ల లెక్కింపు కోసం నగరంలో 30 సర్కిళ్ళలో 30 కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఒక్కో కేంద్రంలో 14 టేబిల్స్ చొప్పున ఏర్పాటు చేసింది. ఈసారి మొత్తం 1,962 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. మొదట వాటిని లెక్కించిన తరువాత బ్యాలెట్ బాక్సులు తెరుస్తారు.
ఒక్కో రౌండ్‌లో ఒక్కో టేబిల్‌పై వెయ్యి ఓట్లు చొప్పున లెక్కిస్తారు. కనుక తొలిరౌండ్‌లో 14,000 ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఈసారి అనేక డివిజన్‌లలో 25-28000 ఓట్లు మాత్రమే పోలింగ్ అయినందున రెండో రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి ఆయా డివిజన్‌లలో ఎవరు గెలిచారో తేలిపోతుంది.
మోహిదీపట్నం డివిజన్‌లో కేవలం 11,000 ఓట్లు మాత్రమే నమోదైనందున తొలిరౌండ్‌లోనే లెక్కింపు పూర్తవుతుంది. ఒక్కో రౌండ్ లెక్కింపుకు సుమారు గంట-గంటన్నర సమయం పడుతుంది. కనుక ఉదయం 10 గంటలలోపు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది.