రీపోలింగ్‌ జరపాలని హైకోర్టు సూచన

రేపు ఉదయం నుంచి జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టాడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొంది. ఇటువంటి సమయంలో ఝాన్సీబజార్, పురానాపూల్ డివిజన్‌లలో రీపోలింగ్ జరిపే అవకాశాలను పరిశీలించాలంటూ హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. ఆ రెండు డివిజన్‌లలో మజ్లీస్‌ పార్టీ కార్యకర్తలు బూత్ క్యాప్చరింగ్ చేసి రిగ్గింగ్ చేశారని అక్కడ నుంచి పోటీ చేసిన బిజెపి అభ్యర్ధులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు కూడా వారి పిటిషన్లను తిరస్కరించినా స్పష్టత ఉండేది. లేదా ఆ రెండు డివిజన్‌లలో పోలింగ్ రద్దు చేసి మళ్ళీ రీపోలింగ్ జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించినా స్పష్టంగా ఉండేది. కానీ రీపోలింగ్ నిర్వహించేందుకు అవకాశాలను పరిశీలించాలంటూ ‘సూచన’ మాత్రమే చేసింది. అక్కడి అభ్యర్ధులు పదేపదే ఫిర్యాదు చేసిన పట్టించుకోని ఎన్నికల సంఘం హైకోర్టు ఇచ్చిన ఈ సూచనను పట్టించుకొంటుందనుకోలేము. కనుక రేపు యధాతధంగా ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటించడం ఖాయమనే భావించవచ్చు.