
మొన్న 1వ తేదీన జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగులో ఓల్డ్ మలక్‌పేట పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పేపర్లలో సిపిఐ, సిపిఎం పార్టీల ఎన్నికల గుర్తులు తారుమారుగా ముద్రించడంతో పోలింగ్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. సుమారు రెండు గంటల సేపు పోలింగ్ జరిగిన తరువాత గానీ బ్యాలెట్ పేపర్లలో ఎన్నికల గుర్తులు తప్పుగా ముద్రించబడ్డాయనే విషయం రిటర్నింగ్ అధికారి కూడా గుర్తించలేదు. దాంతో పోలింగ్ నిలిపివేసే సమయానికి 3,450 మంది ఓట్లు వేశారు.
ఎన్నికల సంఘం వారందరి ఓట్లు రద్దు చేసి మళ్ళీ నేడు ఓట్లు వేసేందుకు అవకాశం కల్పిస్తోంది. మొన్న ఎడమచేతి చూపుడు వేలుకి సిరా చుక్క వేసినందున ఇవాళ్ళ వారి ఎడమచేతి మద్యవేలికి సిరాచుక్క వేసి ఓటు వేసేందుకు అనుమతించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అలాగే బ్యాలెట్ పేపర్లలో జరిగిన పొరపాటును గుర్తించకుండా పోలింగ్ నిర్వహించినందుకు రిటర్నింగ్ అధికారిని సంధ్యారాణిని తొలగించి ఆమె స్థానంలో శైలజను నియమించింది. రీపోలింగ్ జరుగుతున్నందున ఆ ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, విద్యాలయాలు, వ్యాపార సంస్థలకు నేడు సెలవు దినంగా ప్రకటించింది.
ఇవాళ్ళ ఉదయం 7 గంటల నుంచి కొత్తగా ముద్రించిన బ్యాలెట్ పేపర్లతో మళ్ళీ రీపోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. యధాప్రకారం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసారు. అలాగే కరోనా నేపధ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారు.
నగరంలో పలు డివిజన్‌లలో ఈసారి చాలా తక్కువ పోలింగ్ నమోదైనందున ఓల్డ్ మలక్‌పేటలో ఉన్న 54,502 మంది ఓటర్లలో ఎంతమంది ఇవాళ్ళ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తారో చూడాలి.