
జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగాన్ని, ఎన్నికల సంఘం వైఫల్యాలను, పోలీసుల తీరునునిరసిస్తూ బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్ నిరసన తెలియజేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట నిన్న నిరాహారదీక్ష చేశారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి నిన్న సాయంత్రం వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, “తక్కువ శాతం పోలింగ్ జరగడానికి ప్రభుత్వం, ఎన్నికల సంఘం, పోలీస్ ఉన్నతాధికారులే కారణం. నగరంలో అల్లర్లు జరుగబోతున్నాయంటూ సిఎం కేసీఆర్ చెప్పగానే డిజిపి, పోలీస్ కమీషనర్లు ఆయనకు వంతపాడుతూ ప్రజలలో భయాందోళనలు సృష్టించారు. వరుస సెలవులు చూసుకొని పోలింగ్ తేదీ నిర్ణయించి పోలింగ్ శాతం తగ్గించడం ద్వారా ఎన్నికల సంఘం అధికార టిఆర్ఎస్‌కు సహకరించింది. టిఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోకపోగా వారికే సహకరించి ప్రభుభక్తి చాటుకొన్నారు. ఈవిధంగా మూడు వ్యవస్థలు కలిసి పోలింగ్ శాతం తగ్గించడం ద్వారా టిఆర్ఎస్‌కు లబ్ది కలిగించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయి. తమ బాధ్యతలను విస్మరించాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము,” అని అన్నారు.