
జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పార్టీల ప్రచారం జరిగిన తీరు దానిపై ప్రజా స్పందన చూసి ఈసారి చాలా భారీగా పోలింగ్ జరుగుతుందని ఆశిస్తే, కేవలం 45.71 శాతం పోలింగ్ మాత్రమే నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటలకు గడువు ముగిసేలోగా పోలింగ్ కేంద్రాలలో ఉన్నవారందరికీ ఓట్లు వేసేందుకు అనుమతించి పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. కొన్ని డివిజన్‌లలో 25శాతం లోపే పోలింగ్ నమోదైంది. డివిజన్‌లవారీగా నమోదైన పోలింగ్ వివరాలను ఇవాళ్ళ ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.
ఓల్డ్ మలక్‌పేటలో సిపిఐ, సిపిఎం పార్టీల గుర్తులు తారుమారుగా ముద్రించడంతో అక్కడ పోలింగ్ రద్దు చేసి మళ్ళీ రేపు (గురువారం) నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల చరిత్రలో 2002 సం.లో 41.22 శాతం, 2009లో 42.95 శాతం, 2016లో 45.27 శాతం పోలింగ్ నమోదు కాగా... ఈసారి 45.71 శాతం నమోదైంది.