
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో రాజకీయపార్టీలు...వాటి నేతలు, కార్యకర్తలు ఎంతగా ఆవేశంతో ఊగిపోయినప్పటికీ, ఓటర్లను మాత్రం పోలింగ్ బూత్‌లకు రప్పించడంలో దారుణంగా విఫలమయ్యారు. సాయంత్రం 5గంటలకు కేవలం 36.73 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసేసరికి బహుశః మరో 3-4 శాతం పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉండవచ్చు. అంటే మొత్తంగా 40-41 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంత దారుణంగా పోలింగ్ శాతం నమోదైనందున ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల చరిత్రను ఓసారి తిరుగకవేయక తప్పదు. 2002 సం.లో 43.27 శాతం, 2009లో 42.92 శాతం, 2016లో 45.27 శాతం నమోదయ్యాయి.
కనుక ఇప్పుడు పోలింగ్ శాతం ఇంత ఎందుకు తగ్గింది? అనే అంశంపై చర్చ మొదలైంది. దీనిపై పలు అభిప్రాయాలు, కారణాలు వెలువడుతున్నాయి.
1. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో చాలా మంది సొంత ఊళ్ళకు లేదా విహారయాత్రలకు వెళ్ళిపోయి ఉండవచ్చు.
2. కరోనా కారణంగా నగరంలో ఐటి కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించడంతో చాలా మంది ఐటి నిపుణులు, కుటుంబాలతో సహా సొంతూళ్ళకు వెళ్లిపోవడం. అదేవిధంగా విద్యావ్యవస్థలు కూడా మూతపడటం ఆన్‌లైన్ క్లాసులకు వెసులుబాటు కల్పించడంతో కుటుంబాలు సొంతూళ్ళకు వెళ్ళిపోవడం.
3. బద్దకం మరియు కరోనా భయాలు.
4. వరుస సెలవులు వస్తే ఈవిధంగానే జరుగుతుందని ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి బాగా తెలిసి ఉన్నప్పటికీ సెలవులతో కలిపి ఎన్నికలను నిర్వహించడం.
5. ప్రజలతో సంబందం లేదన్నట్లు హడావుడిగా ఎన్నికలను ప్రకటించి నిర్వహించడం.
6. నగరంలో భారీ ఎత్తున గొడవలు ఘర్షణలు జరుగుతాయని ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు పదేపదే ప్రజలను హెచ్చరిస్తుండటం.
7. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంపై చూపిన శ్రద్ద ఓటర్లను చైతన్యపరిచి పోలింగ్ బూత్‌ల వరకు తీసుకురావడంలో చూపకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం.
8. రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ నగర సమస్యలపై మాట్లాడకుండా మతపరమైన విభేధాలు సృష్టించేలా సాగడం వలన ఇది మూడు పార్టీలకు మద్య జరుగుతున్న రాజకీయపోరాటమని ఓటర్లు భావించడంతో ఏర్పడిన నిర్లిప్తత. పార్టీల పట్ల ఏహ్యభావం. మరో విధంగా చెప్పాలంటే ఓటు హక్కు వినియోగించుకోకపోవడం ద్వారా హైదరాబాద్‌లో 60 శాతం ప్రజలు ‘నోటా’కు ఓట్లు వేసినట్లు భావించవచ్చు.
9. వరదసాయం అందకపోవడంతో ప్రభుత్వంపై ఆగ్రహం లేదా నిర్లిప్తత.
10. వరదసాయం గురించి ప్రతిపక్షాల హామీలు నమ్మశఖ్యంగా లేకపోవడం.
11. ఏటా ఇటువంటి అనేక సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వం, పార్టీలు ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా వరదసాయం వంటి తాత్కాలిక ఉపాయాలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నాయనే నిర్వేదం. దాంతో ఏ పార్టీకి ఓటు వేసినా దానితో తమకు ఎటువంటి ప్రయోజనం ఉండదనే నిర్లిప్తత.
ఇలా చెప్పుకొంటూపోతే ఇంకా అనేక కారణాలు కనిపిస్తాయి. ఈసారి ఎన్నికల ప్రచారం ఎంత ఉదృతంగా జరిగినప్పటికీ, నగరంలో చాలా ఉద్రేకపూరితమైన వాతావరణం నెలకొన్నప్పటికీ, పోలింగ్ బూత్‌లకు ఓటర్లు రాలేదంటే ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లు ప్రభుత్వం, ఎన్నికల సంఘం, ప్రతిపక్షపార్టీలు, ప్రజలు అందరూ సమానంగా బాధ్యత వహించాల్సిందే. ఇంత తక్కువ పోలింగ్ నమోదవడం అందరికీ సిగ్గుచేటు. ఇంత తక్కువ శాతం పోలింగ్ నమోదవడంతో మళ్ళీ ఇప్పుడు మరో రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
1. పోలింగ్ శాతం పెంచాలంటే ఎటువంటి చర్యలు, మార్పులు, సంస్కరణలు, నియమనిబందనలు అమలు చేయాలి?
2. పోలింగ్ శాతం ఇంత తక్కువగా నమోదైనందున టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలలో దేనికి లబ్ది కలుగుతుంది? ఈ రెండు ప్రశ్నలు చిన్నవే కానీ సమాధానాలు చాలా పెద్దవి కనుక వీటిపై వేరేగా చర్చించాల్సి ఉంది.