
ఈసారి బిజెపి జీహెచ్‌ఎంసీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడటంతో గెలుపు కోసం చాలా ఆరాటపడుతోంది. టిఆర్ఎస్‌కు కూడా ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం కనుక ఎట్టి పరిస్థితులలో గెలిచితీరాలని ఆ పార్టీ కూడా పట్టుదలగా ఉంది. కనుక నేడు పోలింగ్ సందర్భంగా నగరంలో పలు పోలింగ్ కేంద్రాలలో టిఆర్ఎస్-బిజెపి కార్యకర్తల మద్య ఘర్షణలు జరుగుతున్నాయి.
ఇవాళ్ళ ఉదయం కూకట్‌పల్లిలో టిఆర్ఎస్ నేతలు ఓటర్లకు డబ్బు పంచుతున్నట్లు ఆరోపిస్తూ బిజెపి కార్యకర్తలు వారిపై దాడి చేశారు. దాంతో ఇరువర్గాల మద్య తోపులాటలు జరిగాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారులో డబ్బు తీసుకువచ్చినట్లు అనుమానించిన బిజెపి కార్యకర్తలు ఆయన కారుపై దాడిచేశారు. దాంతో ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పరం కొట్టుకొన్నారు. వారిని అడ్డుకొనేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఇరు వర్గాలు వెనక్కు తగ్గకపోవడంతో వారిపై పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేసి అక్కడి నుంచి తరిమేశారు. ఈ ఘర్షణలలో ఇరు పార్టీల కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. బిజెపి కార్యకర్తల దాడిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారు అద్దం పగిలింది. ప్రస్తుతం కూకట్‌పల్లిలో ఉద్రిక్త వాతావరణం మద్య పోలింగ్ కొనసాగుతోంది.