కేసీఆర్‌కు నేనే ఏకైక ప్రత్యామ్నాయం : మందకృష్ణ మాదిగ

మహాజన సోషలిస్ట్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిన్న చాలా అనూహ్యమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో కేసీఆర్‌ నిరంకుశత్వ పాలన పరాకాష్టకు చేరింది. టిఆర్ఎస్‌ను గెలిపిస్తే దళితుల ఒక్కో కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్‌ అధికారంలోకి రాగానే బడుగుబలహీన వర్గాలకు చెందిన నిరుపేద రైతులకు చెందిన లక్షలాది ఎకరాల భూములను బలవంతంగా లాక్కొంటూ వారి బతుకులు నాశనం చేస్తున్నారు. ఈ నిరంకుశ దొరలపాలనను అంతమొందించడానికి నేటి నుంచే అలుపెరుగని పోరాటాలు ప్రారంబిద్దాం. ఈ మూడేళ్లు గట్టిగా పోరాడి వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి రాష్ట్రంలో మనమే అధికారంలోకి వద్దాం. ఈ పోరాటాలకు నేనే నాయకత్వం వహిస్తాను. ఎందుకంటే సిఎం కేసీఆర్‌కు ఏకైక ప్రత్యామ్నాయం నేనే. రాష్ట్రంలో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వరంగల్‌ను శాసన రాజధానిగా చేసుకొని అద్భుతమైన పాలన అందిస్తాము,” అని మందకృష్ణ మాదిగ అన్నారు.  

ఈ సందర్భంగా మహాజన సోషలిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా హన్మకొండకు చెందిన తీగల ప్రదీప్ గౌడ్‌ను నియమిస్తున్నట్లు మందకృష్ణ మాదిగ ప్రకటించారు.