ప్రభుత్వాన్ని విమర్శించాలనుకోలేదు: హైకోర్టు

కరోనాకు సంబందించి దాఖలైన కేసులపై హైకోర్టు గురువారం మళ్ళీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యి రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించి తత్ఫలితంగా రాష్ట్రంలో కరోనా వైరస్ చాలా వరకు అదుపులోకి వచ్చిందని తెలిపారు. హైకోర్టు సూచనల మేరకు హెల్త్ బులెటిన్‌లలో కరోనాకు సంబందించి సమగ్ర సమాచారం ఇస్తున్నామని, కరోనా రోగులను పీడిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకొంటున్నామని హైకోర్టుకు తెలియజేశారు. వారి వివరణపై హైకోర్టు చాలా సంతృప్తి వ్యక్తం చేసింది. 

తాము ప్రభుత్వాన్ని, అధికారులను విమర్శించుకోవాలనుకోలేదని కేవలం చిన్న చిన్న లోపాలను సరిదిద్ది తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలనే ఉద్దేశ్యంతోనే కాస్త కటినంగా వ్యవహరించవలసి వచ్చిందని హైకోర్టు తెలిపింది. కరోనా కట్టడి విషయంలో ఇప్పుడు నూటికి 99 శాతం అంతా సవ్యంగా సాగుతోందని హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది.      తెలంగాణ ప్రభుత్వం సరైన దిశలోనే ప్రయాణిస్తోందని మెచ్చుకొంది.