కేసీఆర్‌పై జేపీనడ్డా తీవ్ర విమర్శలు

తెలంగాణ సిఎం కేసీఆర్‌పై బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ జిల్లాలలో సోమవారం ఉదయం జరిగిన బిజెపి కార్యాలయాల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరిగింది. డిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆ కార్యక్రమంలో పాల్గొన్న జేపీ నడ్డా, అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. రూ.45,000 కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను రూ.85,000 కోట్లకు పెంచేసి దోచుకొన్నారు. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తానని చెప్పిన కేసీఆర్‌ ఇప్పటివరకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. టిఆర్ఎస్‌ అధికారంలో వస్తే రాష్ట్రంలో పేదలకు 7 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌ ఇంతవరకు 50,000 ఇళ్ళు కూడా పూర్తిచేసి ఇవ్వలేకపోయారు. అసలు ఈ ఆరేళ్లలో సిఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు... రాష్ట్రానికి చేసిందేమిటో చెప్పాలి.

సిఎం కేసీఆర్ కనీసం కరోనాను కట్టడి చేయలేక కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు. హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా కేసీఆర్‌కు ఇంకా మెలకువ రాకపోవవడం చాలా విచిత్రంగా ఉంది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ పధకాన్ని తెలంగాణలో అమలుచేయడానికి కేసీఆర్‌ నిరాకరిస్తుండటం వలన రాష్ట్రంలో 9.5 లక్షలమంది నిరుపేదలు నష్టపోతున్నారు. లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఏవిధంగా టిఆర్ఎస్‌కు బుద్ధి చెప్పారో అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలి,” అని జేపీ నడ్డా అన్నారు.