
కాంగ్రెస్ మాజీ ఎంపీ నంది ఎల్లయ్య (78) శనివారం ఉదయం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నెల 29న ఆసుపత్రిలో చేరారు. అప్పుడు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఆయనను కాపాడేందుకు వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ రోజురోజుకీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఇవాళ్ళ ఉదయం కనుమూశారు.
నంది ఎల్లయ్య సిద్ధిపేట నుంచి ఐదుసార్లు, నాగర్ కర్నూల్ నుంచి ఒకసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. పార్లమెంటులో సీనియర్ సభ్యులలో నంది ఎల్లయ్య కూడా ఒకరని చెప్పవచ్చు. నంది ఎల్లయ్య ముషీరాబాద్ పరిధిలోని భోలక్‌పూర్‌లో జూలై 1, 1942లో జన్మించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీలో సీనియర్ నేతలు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.