దుబ్బాక టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి

దుబ్బాక టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే రామలింగారెడ్డి (57) బుదవారం అర్ధరాత్రి మృతి చెందారు. రెండువారాల క్రితం ఆయన కాలికి శస్త్ర చికిత్స జరిగింది. అప్పటి నుంచి ఆయనకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. దాంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. నిన్న సాయంత్రం ఆయన పరిస్థితి విషమించడంతో గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన పరిస్థితి మరింత విషమించి నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత కనుమూశారు. 

 దుబ్బాక మండలంలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన రామలింగారెడ్డి జర్నలిస్టుగా జీవితం ప్రారంభించారు. మొదట ఆయన ఉమ్మడి మెదక్‌ జిల్లా, సంగారెడ్డి, సిద్ధిపేట, జహీరాబాద్, దుబ్బాక తదితర ప్రాంతాలలో వివిద పత్రికలలో పనిచేశారు. కొంతకాలం నక్సలైట్ ఉద్యమాలలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. ఆ తరువాత రాజకీయాలలోకి  ప్రవేశించి 2004 సం.లో దుబ్బాక నుంచి శాసనసభకు పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. మళ్ళీ 2008లో జరిగిన ఉపఎన్నికలలో కూడా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమాలు ఊపందుకోవడంతో ఆయన వాటిలో చురుకుగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా మారారు. ఆ తరువాత 2014,2018 శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్‌ తరపున పోటీ చేసి విజయం సాధించారు. చనిపోయే సమయానికి శాసనసభ అంచనాల కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. 

రామలింగారెడ్డి అటు తన నియోజకవర్గంలోని ప్రజలతో, ఇటు పార్టీలో అందరితో చాలా కలుపుగోలుగా ఉండేవారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తుండేవారు. అటువంటి  వ్యక్తి హటాత్తుగా చనిపోవడంతో నియోజకవర్గంలోని ప్రజలు, టిఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు అందరూ షాక్ అయ్యారు. రామలింగారెడ్డికి భార్య సుజాత, కుమారుడు సతీష్ రెడ్డి, కుమార్తె ఉదయశ్రీ ఉన్నారు.