
టిఎస్ ఆర్టీసీ సమ్మెపట్ల సిఎం కేసీఆర్ ఈరోజు మళ్ళీ మరోసారి తన ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె-ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఈరోజు ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సిఎం కేసీఆర్ సమ్మె చేస్తున్న కార్మికులతో ఎటువంటి చర్చలు జరుపబోమని, వారికి జీతాలు కూడా ఈయబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విధులలో చేరిన 1200 మందికి మాత్రం జీతాలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాల బెరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు. సమ్మెను దృష్టిలో ఉంచుకొని విద్యాసంస్థలకు దసరా శలవులను ఈనెల 19వరకు పొడిగించాలని నిర్ణయించారు.
ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముందే సంకేతాలు ఇచ్చారు కనుక ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాయి. ఈనెల 13న రాష్ట్రవ్యాప్తంగా డిపోల ముందు వంటావార్పు, 14న డిపోల ముందు బైటియింపు, 15న రాస్తారోకోలు, 16న మానవహారాలు, 17న విద్యార్ధి సంఘాలతో ర్యాలీలు, 17న ధూంధాం, 18న బైక్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించాయి. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే 19న తెలంగాణ బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి. కనుక రాగల వారంపది రోజులలో రాష్ట్రంలో ఉద్రిక్తవాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.