
ఆర్టీసీ సమ్మె నానాటికీ ఉదృతం అవుతుండటంతో సిఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల స్థానంలో కొత్తవారిని నియమించుకోవడం, ఆర్టీసీలో 30 శాతం అద్దెబస్సులను, 20 శాతం ప్రైవేట్ సర్వీసులను ప్రవేశపెట్టడంపై అధికారులు సిఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పించినట్లు సమాచారం. కనుక ఆర్టీసీకి సంబందించి సిఎం కేసీఆర్ నేడు కీలకనిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. సమావేశానికి ముందే రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేము హామీ ఇవ్వలేదు. అది మా ప్రభుత్వ విధానం కాదు. కనుక విలీనం చేసే అవకాశమే లేదు,” అని చెప్పారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నదే కార్మికుల ప్రధాన డిమాండ్. కానీ ప్రభుత్వం అందుకు అంగీకరించబోదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముందే తేల్చి చెప్పేశారు కనుక ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు మద్య ప్రతిష్టంభన ఇంకా కొనసాగే అవకాశమే కనిపిస్తోంది. ఒకవేళ ఆర్టీసీలో కొత్తవారిని భర్తీ చేయాలని సిఎం కేసీఆర్ నిర్ణయించినట్లయితే, ఆర్టీసీ కార్మిక సంఘాలు, వాటికి మద్దతు ఇస్తున్న ప్రతిపక్షాలు ఆందోళనలను ఇంకా ఉదృతం చేయవచ్చు. ఈరోజు సాయంత్రంలోగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు వెలువడవచ్చు కనుక దానిని బట్టి ఆర్టీసీ కార్మిక సంఘాల కార్యాచరణ ఉంటుంది.