
సిఎం కెసిఆర్ నిన్న నల్గొండ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ తాను మూడో కన్ను తెరిచానంటే చంద్రబాబు నాయుడు భస్మం అయిపోతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిపై తెలంగాణా టిడిపి సీనియర్ నేత పెద్దిరెడ్డి స్పందిస్తూ, “మూడో కన్ను తెరవడానికి సిఎం కెసిఆర్ శివుడు కాదు. ఆ శివుడి వరం పొందిన భస్మాసురుడు వంటివారు. మిగులు బడ్జెట్ తో చేతికి అందిన తెలంగాణా రాష్ట్రాన్ని తన భస్మాసుర హస్తంతో నాలుగేళ్ళలో అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళుతూ తన పార్టీ నెత్తినే భస్మాసుర హస్తాన్ని పెట్టుకొన్నారు. ఆయన దెబ్బకి టిఆర్ఎస్ భస్మం అయిపోవడం ఖాయం. ముందస్తు ఎన్నికలకు వెళ్ళి తన గొయ్యి తానే తవ్వుకొన్నారు.
మా పార్టీకి రాష్ట్రంలో 0.2 శాతం కూడా ఓట్లు లేవని చెపుతున్న కెసిఆర్ మరి మా పార్టీని చూసి ఎందుకు అంత భయపడుతున్నారు. ఒక రాజకీయ పార్టీగా మేము మరొకపార్టీతో పొత్తులు పెట్టుకొంటే వద్దనడానికి ఆయనెవరు? ఆయన మా పార్టీలతో పొత్తులు పెట్టుకొంటే అది తప్పు కాదు కానీ మేము పొత్తులు పెట్టుకొంటే తప్పా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సాటి ముఖ్యమంత్రి గురించి అలాగేనా మాట్లాడేది? తెలంగాణా ప్రజల గౌరవానికి భంగపరిచేవిధంగా సిఎం కెసిఆర్ చాలా నీచమైన బాష మాట్లాడుతున్నారు. ఆయనలాగ దిగజారి మాట్లాడలేకనే మేము పద్దతిగా బదులిస్తున్నాము. కెసిఆర్ ఇప్పటికైనా నోటిని అదుపుచేసుకొంటే మంచిది,” అని పెద్దిరెడ్డి హెచ్చరించారు.