రాములమ్మకు రామిరెడ్డి..తెలంగాణాకు కెసిఆర్‌ విలన్!

కాంగ్రెస్‌ ప్రచార కమిటీలో స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి గురువారం గద్వాల బహిరంగసభలో మాట్లాడుతూ, “ఆనాడు నా రాములమ్మ సినిమాలో విలన్ రామిరెడ్డి ఏవిధంగా దొరతనం ప్రదర్శిస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టేవాడో, ఈనాడు తెలంగాణా సిఎం కెసిఆర్‌ కూడా అదేవిధంగా దొరతనం ప్రదర్శిస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారు. రామిరెడ్డి సినిమా విలన్ అయితే, సిఎం కెసిఆర్‌ నిజజీవితంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఉద్యమ సమయంలో కెసిఆర్‌...ఇప్పటి కెసిఆర్‌ వేరు. కెసిఆర్‌ కుటుంబ సభ్యులు నలుగురూ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారు. వారిని గద్దె దించవలసిన సమయం ఆసన్నమైంది,” అని అన్నారు. 

ఈ సభలో మాట్లాడిన జైపాల్ రెడ్డి కూడా సిఎం కెసిఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “తెలంగాణా కోసం తన ప్రాణాలను పణంగా పెట్టానని కెసిఆర్‌ చాలా గొప్పలు చెప్పుకొంటున్నారు. కానీ 2009 నవంబరులో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఆసుపత్రిలో ఆయనకు రోజుకు 750 కెలరీల శక్తినందించే ఇంజెక్షన్లు చేయించుకోవడం నిజమా కాదా? ఆయన చెప్పాలి. తెలంగాణా ఉద్యమ ద్రోహులందరినీ పార్టీలో చేర్చుకొని ప్రతిపక్షాలను తెలంగాణా ద్రోహులని నిందింస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణా ఏర్పాటులో అవరోధాలు ఎదురవుతున్నప్పుడు, కేంద్రమంత్రిగా ఉన్న నేను సోనియాగాంధీతో మాట్లాడి రాష్ట్ర విభజనకు ఒప్పించి తెలంగాణా ఏర్పడేలా చేశాను. ఆ సంగతి కెసిఆర్‌కు కూడా తెలుసు. కానీ తెలంగాణా తన ఒక్కడివల్లే వచ్చిందన్నట్లు గొప్పలు చెప్పుకొంటున్నారు. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను గెలిపిస్తే ఆయన నరేంద్ర మోడీతో చేతులు కలుపుతారు,” అని అన్నారు.