
తెలంగాణా రాష్ట్ర బిజెపి ఇన్చార్జిగా కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి జేపీ నడ్డాను నియమింపబడ్డారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ మేరకు పార్టీకి ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఆయన రాష్ట్ర బిజెపి నేతలతో తరచూ సమావేశం అవుతూ పార్టీ అభ్యర్ధులను ఖరారు చేయడం, ఎన్నికల ప్రచారం, వ్యూహాలను రూపొందించడం వంటి అన్ని అంశాలపై నిర్ణయాలు తీసుకొంటారు.
ఇప్పటికే టిఆర్ఎస్ అభ్యర్ధులు తమ తమ నియోజకవర్గాలలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకొంటున్నారు. అలాగే సిఎం కెసిఆర్ కూడా నిన్నటి నుంచి వరుసగా బహిరంగసభలు నిర్వహించడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్ధులను ప్రకటించనప్పటికీ, నేటి నుంచి సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గత నెల మహబూబ్ నగర్ లో మొట్ట మొదటి ఎన్నికల ప్రచారసభ నిర్వహించినప్పటికీ ఎన్నికలకు సంబందించి పార్టీపరంగా ఎటువంటి కీలక నిర్ణయమూ తీసుకోకపోవడంతో ఎన్నికల రేసులో బిజెపి చాలా వెనుకబడిపోయుంది. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర బిజెపి నేతలకు కలవరపరిచేవే. కనుక బిజెపి అధిష్టానం కూడా చురుకుగా పావులు కదపడానికి సిద్దం అవుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే జెపి నడ్డాకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది. అమిత్ షా ఈనెల 10న కరీంనగర్ లో బహిరంగసభ నిర్వహించబోతున్నారు. కనుక త్వరలోనే బిజెపి పార్టీ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టవచ్చు.