
ఒకప్పుడు తెలుగు సినిమాలలో హాస్యనటుడిగా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన బాబూ మోహన్ రాజకీయాలలో చేరి 2014 ఎన్నికలలో టిఆర్ఎస్ టికెట్ సంపాదించుకొని అంధోల్ నుంచి పోటీ చేసి గెలిచారు. రాజకీయాలలోకి వచ్చిన తరువాత ఆయన స్థానిక టిఆర్ఎస్ కార్యకర్తలు, అధికారులు, ప్రజల పట్ల విలన్ గా మారినట్లు వార్తలు వచ్చాయి. బహుశః అందువల్లేనేమో ఈసారి ఆయనకు టికెట్ లభించలేదు.
టిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేక ‘కడుపులో పెట్టుకొని చూసుకొంటామని’ సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. సెప్టెంబరు 6న టిఆర్ఎస్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదలైంది. టికెట్లు రానివారు అందరూ అసమ్మతిస్వరాలు వినిపిస్తూనే ఉన్నారు ఒక్క బాబు మోహన్ తప్ప. ఆయన మిగిలిన వారిలా కామెడీ చేయలేదు. అసలు సిసలైన రాజకీయ నాయకుడిలా గుట్టు చప్పుడు కాకుండా బిజెపి నేతలతో సంప్రదింపులు జరిపి శనివారం డిల్లీ వెళ్ళి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు. ఆయన మళ్ళీ అంధోల్ నుంచే బిజెపి టికెట్ పై పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఎన్నికలలో బాబు మోహన్ గెలిచి, రాష్ట్రంలో టిఆర్ఎస్ గెలిస్తే అప్పుడు ఆయన ఏమి చేస్తారో వేరే చెప్పనవసరం లేదు.