
ఊహించినట్లుగానే కొండా మురళి, సురేఖ దంపతులు కాంగ్రెస్ గూటికి చేరుకొన్నారు. కొద్ది సేపటి క్రితమే వారు డిల్లీలో రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారితో పాటు తొమ్మిది మంది వరంగల్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకొన్నారు. పొత్తులలో భాగంగా వరంగల్ తూర్పు లేదా పరకాల సీటును మిత్రపక్షలకు ఈయవలసి ఉంటుంది కనుక కొండా సురేఖకు ఏదో ఒక చోట నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సంసిద్దత వ్యక్తం చేసింది. ఆమె అందుకు అంగీకరించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది.
టిఆర్ఎస్‌పై పగతో రగిలిపోతున్న కొండా దంపతులు వరంగల్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో టిఆర్ఎస్‌ను ఓడించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తామని రాహుల్ గాంధీకి హామీ ఇచ్చినట్లు సమాచారం. కొండా దంపతులు షిరిడీ సాయినాధుని భక్తులు. కనుక గురువారం శుభదినంగా భావిస్తుంటారు. వారు ఈరోజు సాయంత్రంలోగా వరంగల్ చేరుకొని రేపు ఉదయం నగరంలో సాయినాధుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినా తరువాత ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు.