కొండగట్టు ఘటనపై హైకోర్టులో పిటిషన్

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోగా అనేక మంది గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఘటనలో బాధితుల పట్ల ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు, వైద్యులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బిజెపి నేత ఎన్. ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో ఒక ప్రజాహితవాజ్యం (పిల్) వేశారు.

కాలం చెల్లిన డొక్కు బస్సును ప్రమాదకరమైన ఘాట్ రోడ్డులో నడపిస్తునందుకు జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావుపై, 57 మంది ప్రయాణించవలసిన బస్సులో 105 మందిని ఎక్కించి పంపినందుకు కొండగట్టుపై విధులు నిర్వర్తిస్తున్న ఆర్టీసీ అధికారులపై కేసు నమోదు చేయాలని పిటిషనులో కోరారు.

అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి సరైన చికిత్స అందించడం లేదని, వారందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించాలని కోరారు. మృతుల కుటుంబాలకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని, కొండగట్టు ఘాట్ రోడ్డులో మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవలసిందిగా  ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.