
కొండా సురేఖ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సిఎం కెసిఆర్, కేటీఆర్, కవితలపై చేసిన విమర్శలకు టిఆర్ఎస్ నేతలు గంటలోపే ధీటుగా సమాధానం చెప్పారు. టిఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తదితరులు వరంగల్ నగరంలో టిఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, “వైకాపా నుంచి బయటకు వచ్చిన తరువాత ఏ పార్టీలో చేరేందుకు అవకాశం లేకపోవడంతో నీవు నీ మేనల్లుదీని వెంటపెట్టుకొని నా వద్దకు వస్తే నేను కేటీఆర్ వద్దకు తీసుకువెళ్ళినప్పుడు, నాకు రాజకీయ భిక్ష పెట్టమని ఆయన కాళ్లావేళ్లా పది బ్రతిమాలిన సంగతి మరిచిపోయావా? సెటిల్మెంట్లు, కార్పొరేటర్లను, కాంట్రాక్టర్లను బెదిరించడం, కాళ్ళు మొక్కించుకోవడం తప్ప ప్రజల కోసం మీ దంపతులు ఇద్దరూ ఏమి చేశారు. నీవు చేరబోయే వేరే పార్టీలో ఎవరో వ్రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని వచ్చి చదువుతూ సిఎం కెసిఆర్ ను విమర్శించడం చూస్తే నీకు మతిభ్రమించినట్లుంది. కేటీఆర్, కవితక్క ఇద్దరూ ఉద్యమాలలో పాల్గొని రాజకీయాలలోకి వచ్చారు. కానీ వారిని విమర్శిస్తున్న నీవు ఉద్యమసమయంలో ఎక్కడున్నావు? జయశంకర్ సార్ చనిపోయినప్పుడు కేటీఆర్‌తో సహా మేమందరం అక్కడే ఉన్నాము. అప్పుడు మీ దంపతులు ఇద్దరూ ఎక్కడున్నారు? ఇప్పుడు మీ కుటుంబానికి అడిగినన్ని టికెట్లు ఇవ్వలేదని చెప్పి నాలుగేళ్ళు టిఆర్ఎస్ సర్కారును సిఎం కెసిఆర్‌ను పొగిడిన నోటితోనే ఆరోపణలు చేస్తున్నావు. ప్రజలు నిన్ను క్షమిస్తారని భావిస్తున్నావా? మీకు అంత బలం ఉందనుకొన్నప్పుడు టిఆర్ఎస్‌లో టికెట్ లభించకపోతే ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు? మీ అంతట మీరే మీకు కావలసినన్ని సీట్లు గెలుచుకోవచ్చు కదా? వాపును చూసి బలుపు అనుకొంటూ మిడిసిపడుతున్న మీ ఇద్దరికీ త్వరలో జరుగబోయే ఎన్నికలలో వరంగల్ ప్రజలే గట్టిగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.