తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ అడ్డా. టిఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా పట్నం నరేందర్ రెడ్డి నన్ను ఓడించలేడు. ఈ ఎన్నికల తరువాత పట్నం సోదరులిద్దరిచేత పదేళ్ళపాటు రాజకీయ సన్యాసం చేయిస్తాను. వాళ్ళకు ఇవే చివరి ఎన్నికలు కాబోతున్నాయి. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. అలాగే లోక్సభ ఎన్నికలలో బిజెపిని ఓడించి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం తధ్యం,”అని అన్నారు.
ఈసారి ఎన్నికలలో కొడంగల్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి, తాండూర్ నుంచి ఆయన సోదరుడు పట్నం మహేందర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. టిఆర్ఎస్కు పక్కలో బల్లెంలా మారిన రేవంత్ రెడ్డిని ఈ ఎన్నికలలో ఏవిధంగానైనా ఓడించి ఆయన చేత రాజకీయ సన్యాసం చేయించాలని టిఆర్ఎస్ చాలా పట్టుదలగా ఉంది. అందుకే పట్నం సోదరుల చేతే రాజకీయ సన్యాసం చేయిస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి తన స్వంత బలంతో బరిలో దిగుతుంటే, పట్నం నరేందర్ రెడ్డికి సిఎం కెసిఆర్, టిఆర్ఎస్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కనుక ఈసారి కొడంగల్లో వారిరువురి మద్య మంచి రసవత్తరమైన పోటీ జరుగబోతోంది.