
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి సికింద్రాబాద్ న్యాయస్థానం ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలు చంచల్ గూడా జైలు అధికారులకు అందిన తరువాత లాంచనాలు పూర్తి చేసి ఆయన విడుదల చేసేటప్పటికి సాయంత్రం కావచ్చు. జగ్గారెడ్డికి బెయిల్ మంజూరు అయినట్లు తెలియగానే ఆయన అనుచరులు చంచల్ గూడా జైలు వద్దకు చేరుకొని ఆయనకు స్వాగతం చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు.
జగ్గారెడ్డి నకిలీ పాస్ పోర్టుతో 2004లో గుజరాత్ కు చెందిన ముగ్గురు వ్యక్తులను తన భార్యా పిల్లలుగా పేర్కొంటూ అమెరికాకు తరలించినందుకు ఆయనను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టిఆర్ఎస్ నేతలు కూడా ఈ మనుషుల అక్రమరవాణాలో పాల్గొన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఈ కేసుతో తనను రాజకీయంగా దెబ్బ తీయాలని టిఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన జగ్గారెడ్డి ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత వారిపై ఆరోపణలు గుప్పించే అవకాశం ఉంది. కనుక ఈ అంశంపై కాంగ్రెస్-టిఆర్ఎస్ నేతల మద్య మళ్ళీ మాటల యుద్దం ప్రారంభం కావచ్చు.