టిఆర్ఎస్‌ జాబితాపై బిజెపి వ్యాఖ్యలు

సిఎం కెసిఆర్‌ శాసనసభను రద్దు చేసిన వెంటనే 105 మంది అభ్యర్ధుల జాబితాను విడుదల చేసి సంచలనం సృష్టించారు. వారిలో ఇద్దరు తప్ప మిగిలిన వారందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలే కావడం మరో విశేషం. సాధారణంగా అంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్స్ లభించడం ఎక్కడా జరుగదు. కానీ వారిలో కొందరి పనితీరుపట్ల ప్రజలలో అసంతృప్తి నెలకొని ఉన్నప్పటికీ, సిఎం కెసిఆర్‌ మళ్ళీ వారికే టికెట్స్ కేటాయించడం విశేషం. వారందరినీ గెలిపించే బాధ్యత తనదేనని చెప్పడం ఆయనా ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

అయితే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ దానిని మరోకోణంలో చూపుతున్నారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఫిరాయింపుదారులతోనే బలపడిన టిఆర్ఎస్‌ ఇప్పుడు వారివలననే బలహీనపడబోతోంది. సిఎం కెసిఆర్‌ ఒకేసారి 105 మంది అభ్యర్ధుల జాబితాను విడుదల చేయడం ఆయనలోని అభద్రతాభావానికి అద్దం పడుతోంది. ఒకవేళ సిట్టింగులందరికీ మళ్ళీ టికెట్స్ కేటాయించకపోతే వారు తిరుగుబాటు చేసి పార్టీ వీడిపోయే ప్రమాదం ఉంటుంది కనుకనే మళ్ళీ వారికే టికెట్లు కేటాయించారు. కానీ వారిలో ఎంతమందికి బి-ఫారంలు ఇస్తారో ఎవరికీ తెలియదు. సిఎం కెసిఆర్‌ ప్రతిపక్షాలతోనే కాక తన పార్టీ అభ్యర్ధులతో కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారని మేము భావిస్తున్నాము. త్వరలో టిఆర్ఎస్‌ నుంచి భారీ స్థాయిలో వలసలు మొదలవనున్నాయి. ఆ పార్టీకి చెందిన అనేకమంది ముఖ్య నేతలు మాతో టచ్చులో ఉన్నారు. వారిలో మాతో కలిసి పనిచేయగలవారిని గుర్తించి పార్టీలోకి ఆహ్వానించి టికెట్లు ఇస్తాము. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే మా అభ్యర్ధులను ప్రకటిస్తాము,” అని అన్నారు.