
తెలంగాణా విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించదానికి హైకోర్టు మార్గం సుగమం చేసింది. క్రమబద్దీకరణను వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై సుదీర్గ విచారణ అనంతరం హైకోర్టు ధర్మాసనం మంగళవారం కొట్టివేసింది. దీంతో విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న 23,667 మంది ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ట్రాన్స్ కొ జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదముద్ర పడినట్లయింది.
ఈ వ్యవహారంలో విద్యుత్ సంస్థలకు, కాంట్రాక్ట్ కార్మిక సంఘాలకు మద్య కుదిరిన ఒప్పందంలో న్యాయస్థానంతో సహా బయటి వ్యక్తులు ఎవరూ జోక్యం చేసుకోలేరని ధర్మాసనం తీర్పు చెప్పింది. విద్యుత్ సంస్థలు తమ ఉద్యోగులతో చేసుకొనే ఒప్పందాలు పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టం పరిధిలోకి వస్తాయని, కనుక ఆ చట్టంలో సెక్షన్స్: 18(1), 12(3) ల ప్రకారం చేసుకొన్న ఒప్పందాలను బయటి వ్యక్తులు ఎవరూ ప్రశ్నించలేరని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబిఎఎన్. రాధాకృష్ణన్, న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు రంగులు చల్లుకొని మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.