
జగిత్యాల్ జిల్లాలో కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 59కి చేరింది. ఈ ప్రమాదంలో 22 మంది బస్సులోనే చనిపోగా మరో 37 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇంకా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆర్టీసీ చరిత్రలో ఇదే అత్యంత ఘోర ప్రమాదంగా నిలిచిపోతుంది.
నిన్న మంగళవారం కావడంతో అంజన్న దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దాంతో బస్సు సామార్ధ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వలన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారికి అధికారులు పోస్ట్ మార్టం నిర్వహించి శవాలను వారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు. చనిపోయిన వారిలో చాలా మంది నిరుపేదలే కావడంతో అంత్యక్రియలు నిర్వహించేవరకు శవాలను భద్రపరచడానికి ఫ్రీజర్ బాక్సులు ఏర్పాటు చేసుకోలేక శవాల చుట్టూ ఐసు ముక్కలు పేర్చి పైన వారిపొట్టుతో కప్పి ఉంచుతున్నారు. ఇళ్ల ముందు కనిపిస్తున్న వాటిని చూసి అందరూ కంట తడిపెడుతున్నారు.