
ముందస్తు ఎన్నికలకు సన్నాహాలు చేసుకొంటున్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. నకిలీ పాస్ పోర్టుపై ముగ్గురు గుజరాతీ వ్యక్తులను తన భార్యా పిల్లలుగా పేర్కొని అమెరికాకు పంపించిన వ్యవహారంలో అరెస్ట్ అయిన ఆయనను ఈరోజు సికింద్రాబాద్ సివిల్ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎన్నికల సన్నాహాలు చేసుకొంటున్న సమయంలో చంచల్‌గూడ జైలులో గడపవలసి రావడం ఆయనకు పెద షాకేనని చెప్పవచ్చు. పైగా ఈకేసు తీవ్రత దృష్ట్యా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయకపోతే ఆయనకు ఎన్నికలలో పోటీ చేయడం కష్టమే.
టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందరూ ఎన్నికల హడావుడిలో క్షణం తీరిక లేకుండా ఉన్న సమయంలో పోలీసులు జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడం వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది. కనుక జగ్గారెడ్డి కోసం కాంగ్రెస్ నేతలు ఎవరూ సమయం కేటాయించలేని స్థితిలో ఉన్నారు. జగ్గారెడ్డి అరెస్టును ఖండిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ పరిస్థితిలో అంతకుమించి ఎవరూ ఏమీ చేయలేరు. కనుక జగ్గారెడ్డే ఈ కేసు నుంచి బయటపడేందుకు స్వంత ప్రయత్నాలు చేసుకోకతప్పదు.
సుమారు 18 ఏళ్ళ క్రితం జరిగిన వ్యవహారంలో జగ్గారెడ్డిని సరిగ్గా ఎన్నికలకు ముందు అరెస్ట్ చేసి జైలుకు పంపడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ అది రాజకీయ కక్ష సాధింపేనని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఒకవేళ వారి వాదనే నిజమనుకొంటే టిఆర్ఎస్ సర్కారు తనకు గట్టి సవాలు విసురుతున్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి సీనియర్ నేతలపై కూడా ఇదేవిధంగా దృష్టి సారిస్తుందా? ఏమో?