కొండగట్టు ప్రమాదంలో 45కు చేరిన మృతుల సంఖ్య

జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఘాట్ రోడ్డులో ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 45కు చేరింది. ఈ ప్రమాదంలో గాయపడిన 17 మందికి జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన మరో 7మందిని హైదరాబాద్‌ తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఇదే అత్యంత ఘోరప్రమాదం. ఈ ప్రమాదంలో 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.  

బస్సు ప్రమాదానికి రకరకాల కారణాలు వినిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొదట డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతుండటం వలననే ఈ ఘోర ప్రమాదం జరిగిందని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తరువాత బ్రేక్స్ ఫెయిల్ అవడం వలన ప్రమాదం జరిగిందన్నారు. ఈ రెండూ కాదు... బస్సు ప్రయాణించవలసిన బైపాస్ రోడ్డులో కాకుండా ఘాట్ రోడ్డులో క్రిందకు దిగాలని ప్రయత్నించినందునే ప్రమాదం జరిగిందనే వాదన వినిపిస్తోందిప్పుడు. బైపాస్ రోడ్డులోనైతే ఆధనంగా మరో 5 కిమీ ఎక్కువ దూరం ప్రయాణించవలసి వస్తుందని ఆర్టీసీ బస్సులు సైతం ఈ నిషేదిత ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్నాయని స్థానికులు చెపుతున్నారు. ఆ రోడ్డుకు ఎటువంటి రక్షణగోడ లేకపోవడం వలన బస్సు అదుపు తప్పి క్రిందకు పడిపోయినట్లు చిత్రాలలో కూడా కనిపిస్తోంది. అంటే ఎప్పటిలాగే మానవ తప్పిదం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టం అవుతోంది. అంజన్న భక్తులు ఇంత భారీ మూల్యం చెల్లించిన తరువాతయినా అధికారులు మేల్కొని ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ జరుగకుండా అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకొంటారని ఆశిద్దాం.