
జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఘాట్ రోడ్డులో కొద్దిసేపటి క్రితం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కొండపై నుంచి భక్తులతో క్రిందకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో ఒక మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడి అక్కడి నుంచి కొండక్రిందకు దొర్లిపడిపోయింది. ఈ ప్రమాదంలో 12-15 మంది చనిపోయినట్లు తాజా సమాచారం. బస్సులో ఉన్న మరో 50-60 మంది గాయపడ్డారు. వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం సమాచారం అండగానే మంత్రి ఈటల జిల్లా కలెక్టర్, అధికారులను అప్రమత్తం చేసి వెంటనే అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టవలసిందిగా ఆదేశించారు.
ఈరోజు మంగళవారం కావడంతో కొండపై కొలువైన అంజన్న స్వామివారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో బస్సులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రమాదానికి గురైన సమయంలో ఆ బస్సులో సుమారు 70-80 మంది ఉన్నట్లు సమాచారం. వారిలో వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారు.
బస్సు బోల్తాపడగానే అక్కడే ఉన్న స్థానికులు బస్సులో చిక్కుకొన్నవారిని బయటకు తీస్తుండగా అధికారులు, పోలీసులు, వైద్య బృందాలు, అంబులెన్సులు కూడా అక్కడకు చేరుకొని సహాయ చర్యలలో పాల్గొన్నారు.
కొండగట్టు ఘాట్ రోడ్డులో చాలా ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. ఈరోజు ప్రమాదం జరిగిన మలుపు వద్దే గతంలో కూడా అనేకసార్లు ఇటువంటి ప్రమాదాలు జరిగాయి. కానీ ఆ ప్రమాదాలు పునరావృతం కాకుండా ఆలయ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మళ్ళీ ఈరోజు ఈ ఘోరప్రమాదం జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.