జగ్గారెడ్డి అరెస్ట్

సీనియర్ కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డిని సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన 2004లో నకిలీ పాస్ పోర్టుతో ఒక గుజరాతీ మహిళ, ఇద్దరు యువతీ యువకులను తన భార్యా పిల్లలుగా పేర్కొంటూ అమెరికా తీసుకువెళ్లి వదిలి వచ్చిన్నట్లు పాస్ పోర్టు అధికారులు టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు జగ్గారెడ్డిని నిన్న రాత్రి పటాన్ చెరు ప్రాంతంలో అరెస్ట్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. గతంలో ఆయనకు పిఏగా పనిచేసిన ఒక వ్యక్తిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించారు. వారిద్దరినీ ఈరోజు కోర్టులో హాజరుపరిచి తదుపరి విచారణ కొరకు రిమాండ్ కోరవచ్చునని సమాచారం. 

చాలా మంది గుజరాతీయులు తాత్కాలిక వీసాలపై అమెరికా వచ్చి తిరిగి వెళ్లకుండా అక్కడే స్థిరపడిపోతున్నారని గ్రహించిన అమెరికా ప్రభుత్వం 2007లో గుజరాతీయులకు అన్ని రకాల వీసాలు మంజూరు చేయడం నిలిపివేసింది. అయితే ఆ రోజుల్లో ఎలాగయినా అమెరికా వెళ్ళి స్థిరపడాలని చాలా మంది తహతహలాడేవారు. వారి బలహీనత     మనుషులను అక్రమరవాణా చేసే ముఠాలకు వరంగా మారింది. ప్రజా ప్రతినిధులకు ఉండే డిప్లమెటిక్ పాస్ పోర్టు సౌకర్యంతో అటువంటివారిని కుటుంబ సభ్యులుగా చూపి అమెరికా తరలించవచ్చని గ్రహించిన ఆ ముఠాలు ప్రజా ప్రతినిధులకు భారీగా డబ్బు ఆశ జూపి పనికానిచ్చేసేవి. 

2007 సం.లో డిల్లీ పోలీసులు బాబుభాయ్ కటారి అనే ఎంపీని అరెస్ట్ చేసినపుడు ఈ మనుషుల అక్రమ రవాణా వ్యవహారం మొదటిసారిగా బయటపడింది. తీగలాగితే ఆ డొంకలో జగ్గారెడ్డి పేరు కూడా బయటపడింది. అయితే ఈ వ్యవహారం బయటపడి సుమారు 14సం.లు కాగా, ఇన్నేళ్ళపాటు పట్టించుకోని పోలీసులు సరిగ్గా ఇప్పుడు ఎన్నికలకు ముందు జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడమే వివాదాస్పదమవుతోంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగిందని టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.