
ఇటీవల సిఎం కెసిఆర్ ప్రకటించిన 105 మంది టిఆర్ఎస్ అభ్యర్ధుల మొదటి జాబితాలో దానం నాగేందర్ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన సరిగ్గా ఎన్నికలకు ముందు టిఆర్ఎస్‌లో చేరినందున టికెట్ హామీతోనే చెరీ ఉండవచ్చునని అందరూ భావించడమే అందుకు కారణం. కనుక ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారని, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చేసేందుకు ఆయన నగరంలో ఒక హోటల్లో టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో రహస్యంగా సమావేశం అయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
వాటిపై దానం నాగేందర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, “మీడియాలో వస్తున్న ఆ వార్తలను ఖండిస్తున్నాను. కాంగ్రెస్ నేతలు నాతో ఆడుతున్న మైండ్ గేమ్ ఇది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏ హోటల్లో కలుసుకోలేదు. నేను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్లబోవడం లేదు. నేను ఏదో ఆశించి టిఆర్ఎస్‌లో చేరలేదు. సిఎం కెసిఆర్ రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషి చూసి ఆకర్షితుడినై బేషరతుగా పార్టీలో చేరాను.
అయినా నాకు ఎమ్మెల్యే పదవి కొత్తేమీ కాదు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను కనుక నాకు టికెట్ గురించి ఆరాటం లేదు. నాకు టికెట్ రాలేదు కనుక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తానని కాంగ్రెస్ నేతలు అనుకోవడం వారి భ్రమ. వి.హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య వంటి సీనియర్ నేతలకే కాంగ్రెస్ పార్టీలో దిక్కులేదు. కనుక ఆ పార్టీలోకి మళ్ళీ నేనెందుకు వెళతాను. నిజం చెప్పాలంటే ఒక ఈల వేస్తే కాంగ్రెస్ నేతలందరూ టిఆర్ఎస్‌లో చేరిపోవడానికి సిద్దంగా ఉన్నారు. ఎన్నికలు మొదలయ్యేలోగానే ఎంతమంది చేరుతారో మీరు చూస్తారు. ఈ ఎన్నికలతో రాష్ట్రంలో నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. సిఎం కెసిఆర్ మళ్ళీ తెలంగాణా ముఖ్యమంత్రి కావడం తధ్యం,” అని అన్నారు.