
టిఆర్ఎస్ మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంతో రగిలిపోతున్న మాజీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ తన భర్త కొండా మురళీతో కలిసి శనివారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి తమ ఆవేదన వ్యక్తం చేసి, సిఎం కెసిఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తనకు టికెట్ కేటాయించకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఆమె టిఆర్ఎస్ అధిష్టానానికి ఒక లేఖ వ్రాశారు.
కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ, “నాకు టికెట్ ఇవ్వకపోవడానికి నేను చేసిన తప్పు ఏమిటో చెప్పాలని సిఎం కెసిఆర్‌ను డిమాండ్ చేస్తున్నాను. 2014 ఎన్నికలలో నేను పోటీ చేసినప్పటి నుంచి కడియం శ్రీహరి పోటీ చేసినప్పుడు, ఆ తరువాత కార్పొరేషన్ ఎన్నికలలో మేము మా స్వంత డబ్బు ఖర్చు చేసి పార్టీ అభ్యర్ధులను గెలిపించుకొన్నాము. నాకు మంత్రి పదవి ఇవ్వకుండా సిఎం కెసిఆర్ అవమానించినప్పటికీ నేను ఏనాడూ నిలదీసి అడగలేదు. దాని గురించి బహిరంగంగా మాట్లాడలేదు. పార్టీలో, ప్రభుత్వంలో ఎస్సీ, బీసీ మహిళలకు చాలా అన్యాయం జరుగుతున్నా మేము మౌనంగా సహించాము. మేము పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీకి విధేయంగా ఉంటూ పార్టీ కోసం పనిచేసుకుపోయామే తప్ప ఏనాడూ పార్టీకి నష్టం కలిగించే పనులు చేయలేదు. అయినా నాకు టికెట్ ఇవ్వలేదు. ఈవిషయమై మేము నేరుగా సిఎం కెసిఆర్‌తోనే మాట్లాడాలని ప్రయత్నించాము కానీ ఆయన స్పందించకపోవడంతో మంత్రి హరీష్ రావుతో మాట్లాడేందుకు ప్రయత్నించాము కానీ అయన కూడా స్పందించలేదు.
మాకు టికెట్ ఇవ్వకుండా మంత్రి కేటీఆర్ అడ్డుపడ్డారు. ఆయన ప్రభుత్వంలో పార్టీలో ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని వ్యవహరిస్తున్నారు. కెసిఆర్ నాకు టికెట్ ఇవ్వలేదు కనుకనే మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అడగవలసివస్తోంది. మా ప్రశ్నలకు పార్టీ నుంచి జవాబు వస్తుందనే భావిస్తున్నాము. ఒకవేళ సమాధానం రాకపోతే మేము చేతులు ముడుచుకొని కూర్చోలేము కనుక మా నిర్ణయం మేము తీసుకొంటాము. టిఆర్ఎస్ మాకు టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్రంగా పోటీ చేసి గెలవగల సత్తా మాకుంది. టిఆర్ఎస్ మమ్మల్ని పొమ్మనకుండా పొగపెట్టి బయటకు పంపించాలని చూస్తోంది. తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ కుటుంబం స్వంత ఆస్తి కాదని వారు గుర్తుంచుకోవాలి,” అని అన్నారు.