సిఎం కెసిఆర్ నిన్న ప్రతిపక్ష నేతలను తీవ్రంగా విమర్శిస్తే, దానికి వారు కూడా ధీటుగా బదులిస్తున్నారు. తెలంగాణా జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కెసిఆర్‌కు ఐదేళ్లు పాలించమని ప్రజలు అధికారం ఇస్తే చాతకాక 9 నెలలు ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి దిగిపోయారు. పైగా రాష్ట్రం శ్రేయస్సు కోసం తన ప్రభుత్వాన్ని త్యాగం చేస్తున్నానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఆయనను ఎవరు దిగిపోమన్నారు?
ప్రజలందరూ తనవైపే ఉన్నారని, ఎప్పుడు పోటీ చేసినా 100 సీట్లు గెలుచుకొంటామని గొప్పలు చెప్పుకొంటారు కదా. మరి ఎందుకు 9 నెలలు ముందుగా దిగిపోయారు?2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తే ఓడిపోతామనే అభద్రతాభావంతోనే కదా? బలమైన కారణం ఏదీ చెప్పకుండా అసెంబ్లీని రద్దు చేసి దిగిపోవడం ద్వారా సిఎం కెసిఆర్ తన చాతకనితనాన్ని స్వయంగా లోకానికి చాటుకొన్నారు.
అవినీతికి, అధికార దుర్వినియోగానికి అలవాటుపడిన కెసిఆర్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంది. కనుక గవర్నర్ నరసింహన్ తక్షణం కెసిఆర్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించాలి,” అని కోదండరామ్ డిమాండ్ చేశారు.