
కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కొద్ది సేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో వ్రాసిన తన రాజీనామా లేఖను ఆయన స్వయంగా స్పీకర్ మధుసూధనాచారిని కలిసి అందజేయడానికి రాగా, స్పీకర్ ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను ఆయన వ్యక్తిగత కార్యదర్శికి అందజేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యమంటే ఏమాత్రం గౌరవం లేని సిఎం కెసిఆర్ తీరుకు నిరసనగా నేను రాజీనామా చేస్తున్నాను. ఇంకా 9 నెలలు రాష్ట్రాన్ని పరిపాలించేందుకు గడువు ఉన్నప్పటికీ జాతకాలు, గ్రహబలాల కోసం శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన పిచ్చికి ఇది పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఇటువంటి వ్యక్తికి గట్టిగా బుద్ది చెప్పాలంటే ప్రజలలోకి వెళ్ళడం చాలా అవసరం. అందుకే రాజేనామా చేస్తున్నాను,” అని చెప్పారు.