
మరికొద్ది సేపటిలో ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగబోతుండగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అక్కడకు చేరుకొని నిరసనలు చేపట్టడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జిహెచ్ఎంసిలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సర్వశిక్షా అభియాన్, కెటిపిఎస్ ఉద్యోగులు కలిసి ప్రగతి భవన్ వద్దకు చేరుకొని నిరసనలు తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం తమకు కనీస వేతనాలు చెల్లించకుండా నాలుగేళ్ళు చాకిరీ చేయించుకొని హటాత్తుగా చేతులు దులుపుకొని వెళ్ళిపోతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, హెల్త్ కార్డులు ఇవ్వాలని జీతాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.