
ఈరోజు రాష్ట్ర శాసనసభ రద్దు కాబోతున్నందున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒకరోజు ముందుగానే తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచబోతున్న హామీలను ప్రకటించింది. పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ హామీలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ హామీలు:
1. కౌలు రైతులకు కూడా రైతుబందు తదితర ప్రభుత్వ పధకాలన్నీ వర్తింపు.
2. హైదరాబాద్ కు ప్రత్యేకంగా రైతుబందు పధకం.
3. పాడి రైతులందరికీ ఒక లీటరుకు రూ. 4 ప్రోత్సాహకం.
4. రేషన్ డీలర్లకు కమిషన్ రూ.100కు పెంపు.
5. మిడ్‌మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు.
6. ఇందిరమ్మ ఇళ్ల పాత బకాయిలు మాఫీ. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా ఒక గది నిర్మించుకోవడానికి లేదా ఇతర నిర్మాణ అవసరాలకు ప్రతి లబ్ధిదారునికి రూ.2 లక్షలు మంజూరు. ఇకపై ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో లక్ష రూపాయలు.
7. దళిత, గిరిజన కుటుంబాలకు ఉచితంగా రేషన్ పంపిణీ.
8. గృహఅవసరాల నిమిత్తం ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్.
9. అన్ని బీపీఎల్ కుటుంబాలకు ఏడాదికి ఆరు సిలిండర్లు ఉచితం.
10. రేషన్ డీలర్ల కమిషన్ రూ.70 నుంచి రూ.100కు పెంపు.
11. గల్ఫ్ బాధితుల కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు. గల్ఫ్ లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు నష్టపరిహారం. అనారోగ్యం కారణంగా వెనక్కు తిరిగి వచ్చిన వారికి రూ.5 లక్షల ఆర్ధికసాయం.
12. రాష్ట్రంలో తెల్లకార్డుదారులకు రూ.5 లక్షల ఉచిత ప్రమాద బీమా, రూ.5 లక్షల ఆరోగ్యబీమా పథకం అమలు.
13. అన్ని బీపీఎల్ కుటుంబాలకు ఏడాదికి ఆరు సిలిండర్లు ఉచితం
14. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు. దాని పరిధిలోకి అన్ని వ్యాధులు,.
15. కల్యాణలక్ష్మితో బాటు బంగారుతల్లి పథకం అమలు.
హైదరాబాద్ నగరానికి, అలాగే నియోజకవర్గాల వారీగా వేర్వేరుగా ఎన్నికల మ్యానిఫెస్టోలు రూపొందిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నేటితో రాష్ట్రానికి సిఎం కెసిఆర్ పీడ వదిలిపోతుందని, ఇకపై ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని చెప్పారు. రాబోయే ఎన్నికలు తెలంగాణా ప్రజలకు, సిఎం కెసిఆర్ కుటుంబానికి మద్య జరుగుతున్న యుద్దంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు.