తెలంగాణా జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ బుధవారం హైదరాబాద్లోని తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఏదైనా ఒక శుభకార్యక్రమం చేయడానికి మంచి ముహూర్తాలు పెట్టుకొంటాము. కానీ తన ప్రభుత్వాన్ని తానే స్వయంగా కూల్చుకోవడానికి ముహూర్తం పెట్టుకొన్న ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాము. వచ్చే ఏడాది జరుగవలసిన సార్వత్రిక ఎన్నికల వరకు ఆగితే పరిస్థితులు తారుమారై ఓడిపోతామనే భయంతోనే సిఎం కెసిఆర్ 9 నెలలు ముందుగా శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని మేము భావిస్తున్నాము. అయితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈసారి టిఆర్ఎస్కు పరాభవం తప్పదు. మా పార్టీ అన్ని స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తుంది.
ఇతర పార్టీలతో పొత్తుల గురించి ఇప్పుడే ఆలోచించడం తొందరపాటే అవుతుందని మేము భావిస్తున్నాము. ముందుగా మా పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకొన్న తరువాత వాటి గురించి ఆలోచిస్తాము. రాష్ట్రంలో మాకు బలమున్న 50 నియోజక వర్గాలను మేము గుర్తించాము. ఆ నియోజకవర్గాలలో ఇంటింటికీ వెళ్ళి మా పార్టీకి మద్దతు కూడగట్టేందుకు 25మంది ప్రతినిధులను నియమించాము. ప్రగతికి 10 సూత్రాలు పేరుతో మా పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందిస్తున్నాము. త్వరలోనే దానిని విడుదల చేస్తాము,” అని చెప్పారు.