
సిఎం కెసిఆర్ రేపు రాష్ట్ర శాసనసభను రద్దు చేసి ఎల్లుండి అంటే శుక్రవారం హుస్నాబాద్ లో ‘ప్రజల ఆశీర్వాద సభ’ పేరిట మొట్టమొదటి ఎన్నికల ప్రచారసభ నిర్వహించడానికి సిద్దమవుతున్నారు. ఆ సభలో మొట్ట మొదట తమ ప్రభుత్వం దాదాపు 9 నెలల ముందుగా ఎందుకు ఎన్నికలకు వెళ్ళాలనుకోంటోందో సిఎం కెసిఆర్ ప్రజలకు చెప్పవలసి ఉంది.
అయితే ఇంత అకస్మాత్తుగా శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళవలసిన అత్యవసర పరిస్థితులేవీ రాష్ట్రంలో లేవు. టిఆర్ఎస్ సర్కారు పూర్తి మెజారిటీతో తిరుగులేని అధికారంతో చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా నడుస్తోంది. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి కూడా సంతృప్తికరంగానే ఉంది. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు లేవు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోంది కూడా. కనుక శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి రాజకీయ అవసరాలు, రాజకీయ కారణాలు తప్ప ఇతరత్రా కారణాలు ఏవీ కనిపించడం లేదు. ఈ సంగతి సామాన్య ప్రజలకు సైతం తెలుసు. కానీ ఈ కారణాన్ని కెసిఆర్ బహిరంగంగా చెప్పలేరు. కనుక హుస్నాబాద్ సభలో సిఎం కెసిఆర్ ప్రజలకు, ప్రతిపక్షాలకు, మీడియాకు అందరికీ సంతృప్తి కలిగించే ఒక బలమైన కారణం చెప్పవలసి ఉంటుంది.
పూర్తి మెజారిటీ ఉన్న తమ ప్రభుత్వానికి రాజ్యాంగం ప్రకారం ఎప్పుడైనా శాసనసభను రద్ధు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే హక్కు, అధికారం ఉన్నాయని ఆయన చెప్పుకోవచ్చు. కానీ ఆవిధంగా చెపితే ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. ప్రతిపక్షాలు వేలెత్తి చూపడానికి ఆస్కారం కల్పించినట్లవుతుంది. కనుక వేరే బలమైన కారణం ఏదైనా చెప్పవలసి ఉంటుంది.
ఇప్పుడు కెసిఆర్ కోణంలో నుంచి ఆలోచిస్తే, తమ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపధంలో నడిపిస్తూ, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతూ ప్రజారంజకమైన పరిపాలన సాగిస్తుంటే, ప్రతిపక్షాలు తమపై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తూ, కోర్టులలో వందలాది పిటిషన్లు వేస్తూ తమ ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డుపడుతూ సజావుగా పరిపాలన చేయనీయడం లేదని, కనుక తమ ప్రభుత్వం చేస్తున్న పనులకు ప్రజామోదం ఉందో లేదో స్వయంగా తెలుసుకొని, ప్రతిపక్షాలకు కూడా తెలియజేసేందుకే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నామని కెసిఆర్ చెప్పవచ్చు. ఒకవేళ తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తి చెందినట్లయితే మళ్ళీ టిఆర్ఎస్కే ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా సిఎం కెసిఆర్ ప్రజలను కోరవచ్చు.