రాష్ట్ర ఎన్నికల సంఘంలో అత్యవసరంగా ఖాళీలు భర్తీ

తెలంగాణా రాష్ట్ర ఎన్నికల సంఘంలో చిరకాలంగా ఖాళీగా ఉన్న సీఈఓ, డెప్యూటీ సీఈఓ, ఇంకా మరో 18 పోస్టులను తక్షణమే భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషితో సమావేశం అయినప్పుడు ముందస్తు ఎన్నికల నిర్వహించాలంటే ఎన్నికల సంఘంలో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, జిల్లాలో ఎన్నికల అధికారులుగా వ్యవహరించబోయే డీఈవోలందరికీ శిక్షణా కార్యక్రమం నిర్వహించవలసి ఉంటుందని చెప్పగా ఆ రెండు సూచనలకు ఎస్.కె.జోషి వెంటనే అంగీకరించారు. అతి త్వరలోనే ఎన్నికల సంఘంలో ఖాళీలన్నిటినీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారమే డీఈవోలందరికీ శిక్షణా కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎన్నికల సంఘం కార్యాలయంలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ పరిణామాలన్నీ ముందస్తు ఎన్నికలకు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి.