
టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సిఎం కెసిఆర్‌కు సవాలు విసరడంపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్ నేతలు తనపై కక్ష కట్టారని ఆయన చెప్పుకోవడం సిగ్గుచేటు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కలిసి ఆయనకు మద్దతు పలికి రాజ్యసభ సీటు వచ్చేలా చేసిన సంగతి ఆయన అప్పుడే మరిచిపోయినట్లున్నారు. వేరే పార్టీలో నుంచి వచ్చిన ఆయనను ఆదరించి నెత్తిన పెట్టుకొంటే ఇప్పుడు మా అధినేతకే సవాలు విసురుతున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మరో ఇదేళ్లపాటు రాజ్యసభ పదవిలో కొనసాగుతూ ఎంపీ నిధులను కమీషన్లకు అమ్ముకోవచ్చనే దురాశతోనే డిఎస్ ఈ కొత్త నాటకం మొదలుపెట్టారు. ఆయన పార్టీలో ఇమడలేకపోతే పార్టీకి, తన పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చొని ఉండి ఉంటే ఆయన గౌరవం ఇంకా పెరిగి ఉండేది కానీ రాజ్యసభ పదవి నిలుపుకోవడం కోసం ఈవిధంగా నాటకాలు ఆడటం వలన ప్రజల దృష్టిలో చులకన అయిపోయారు. పార్టీలో ఇమడలేనప్పుడు ఇంకా పార్టీని పట్టుకొని వ్రేలాడేబదులు కనీసం ఇప్పటికైనా పార్టీకి, పదవికి రాజీనామా చేస్తే బాగుంటుంది,” అన్నారు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.
డిఎస్ చేస్తున్న ఈ ప్రయత్నాలు టిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటు వేయించుకొని మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరడానికేనని తెలుస్తోంది.