శాసనసభ రద్దుకు ముహూర్తం ఖరారు?

తెలంగాణా శాసనసభ రద్దుకు ముహూర్తం ఖరారు అయ్యిందా? అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే, సాధారణంగా మంత్రివర్గ సమావేశం ఉదయం 10 తరువాత నుంచి సాయంత్రంలోగా ఎప్పుడైనా నిర్వహిస్తుంటారు. కానీ గురువారం ఉదయం 6.45 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగబోతోందని తాజా సమాచారం. సిఎం కెసిఆర్‌కు ముహూర్తాలు, గ్రహబలాలు, జాతకాలను నమ్ముతారనే విషయం అందరికీ తెలిసిందే. కనుక ఆయన జన్మ నక్షత్రం ప్రకారం రేపు ఉదయం ఆ సమయానికే మంత్రివర్గ సమావేశం నిర్వహించి శాసనసభ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి సిద్దపడుతున్నారని సమాచారం. శాసనసభ రద్దు, ముందస్తు ఎన్నికల గురించి సిఎం కెసిఆర్‌తో సహా టిఆర్ఎస్‌ నేతలు ఎవరూ ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ, వారు చేస్తున్న హడావుడి అంతా అదే సూచిస్తోంది. మరొక 24 గంటలలో ఎలాగూ దీనిపై స్పష్టత వస్తుంది కనుక అంతవరకు వేచి చూడకతప్పదు.