లబ్దిదారులు మరిచిపోయినా కెసిఆర్‌ మరిచిపోలేదు...గ్రేట్!

రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు లేనప్పుడే గత నాలుగేళ్ళలో టిఆర్ఎస్‌ సర్కారు అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తూ అందరి మన్ననలు పొందింది. ఇక ముందస్తు ఎన్నికల గంట మ్రోగించిన తరువాత ఊరుకొంటుందా? సిఎం కెసిఆర్‌ రాష్ట్రంలో రేపు మరో సరికొత్త సంక్షేమ పధకాన్ని ప్రారంభించబోతున్నారు. 

రాష్ట్రంలో మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలను, ట్రాలీ ఆటోలను అందించే కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో ప్రారంభించబోతున్నారు. రేపటి కార్యక్రమంలో మొత్తం 885 ద్విచక్రవాహనాలు, 12 ట్రాలీ ఆటోలను సిఎం కెసిఆర్‌ మత్సకారులకు పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్ర మత్స్య మరియు పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగబోతోంది. 

మిషన్ కాకతీయ పధకంలో భాగంగా పూడిక తీసిన చెరువులలో లక్షలాది చేప పిల్లలను వదలడం ద్వారా రాష్ట్రంలో మత్స్యకారులకు ఉపాధిమార్గం చూపిన సిఎం కెసిఆర్‌, ఆ చేపలను బజారులో అమ్ముకొనేందుకు వీలుగా మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలను, ట్రాలీ ఆటోలను అందజేస్తామని ఆనాడే హామీ ఇచ్చారు. బహుశః మత్స్యకారులు కూడా ఆ హామీ గురించి మరిచిపోయుండవచ్చు కానీ సిఎం కెసిఆర్‌ మాత్రం మరిచిపోలేదు. వారికి ఆనాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకొంటూ వాహనాల పంపిణీ కార్యక్రమం బుధవారం మొదలుపెట్టబోతున్నారు.