
ఖమ్మం జిల్లాలో అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన సీనియర్ టిఆర్ఎస్ నేత కొడకండ్ల వెంకటరెడ్డి తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలకు చెందిన టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా పార్టీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. వారందరూ త్వరలోనే మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకొనే అవకాశం ఉంది.
వెంకటరెడ్డి మొదట కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైకాపా తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తాటి వెంకటేశ్వర్లుతో కలిసి వెంకట్ రెడ్డి కూడా టిఆర్ఎస్‌లో చేరారు. కానీ పార్టీలో తగిన గుర్తింపు లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న వెంకటరెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జలగం ప్రసాదరావు ఇటీవల వెంకటరెడ్డిని కలిసి సుదీర్ఘంగా చర్చించిన తరువాత, తాను రాబోయే ఎన్నికలలో ఉమ్మడి జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీకి సిద్దమని ప్రసాదరావు ప్రకటించగా ఆయనకు వెంకట రెడ్డి మద్దతు పలికారు. కాంగ్రెస్ నేతకు మాద్దతు పలకడమే కాక టిఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలు అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు ఇబ్బందికరంగా మారవచ్చు.