
వాయుసేనకు చెందిన మిగ్-27 యుద్ద విమానాలకు ఎగిరే శవపేటికలని ఒక పేరుంది. ఎందుకంటే అవి ఎప్పుడు కూలిపోతాయో ఎవరికీ తెలియదు. అవి కూలిపోయినప్పుడు వాటిని నడుపుతున్న పైలట్లు ప్రాణాలు కోల్పోతుంటారు.
ఆ పేరును సార్ధకం చేసుకొంటున్నట్లు మంగళవారం ఉదయం రాజస్థాన్ లో జోధ్‌పూర్‌లోని భారత వైమానిక శిక్షణా కేంద్రం నుంచి బయలుదేరిన మిగ్-27 యుద్దవిమానం కొద్దిసేపటికే బనాద్ అనే గ్రామశివార్లలో కుప్పకూలిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఈసారి పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు కానీ యుద్ధవిమానం క్షణాలలో కాలి బూడిదైపోయింది.
ఈ సంగతి తెలియగానే స్థానిక పోలీసులు అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. వాయుసేన అధికారులు కూడా అక్కడకు చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. యుద్దాలలో శత్రువుల దాడిలో యుద్దవిమానాలు కూలిపోవడం, వాటిని నడిపే పైలట్లు ప్రాణాలు కోల్పోవడం సహజమే కానీ శిక్షణా సమయంలోనే వందల కోట్లు ఖరీదు చేసే మిగ్-27 యుద్దవిమానాలు తరచూ కూలిపోతుండటం వాటిలో పైలట్లు ప్రాణాలు కోల్పోతుండటం చాలా ఆందోళనాకరం. యుద్ద విమానాలు కూలిపోవడానికి పైలట్ల తప్పిదమే కారణమా లేక యుద్దవిమానాలలో సాంకేతిక లోపాలున్నాయా? అనే విషయం నేటికీ ఎవరికీ తెలియదు. శిక్షణ సమయంలోనే కూలిపోతున్న ఇటువంటి యుద్దవిమానాలతో ఇక శత్రువులతో ఏమి పోరాడగలం? అనే సందేహం కలుగుతుంది.