
హైదరాబాద్లోని గోకుల్ ఛాట్, లుంబినీ పార్కులో 2007లో జరిగిన జంట బాంబు ప్రేలుళ్ళ కేసులో ఎన్.ఐ.ఏ. ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. ఆ కేస్లాలో పట్టుబడిన ఐదుగురు నిందితులలో ఏ-1, ఏ-2గా పేర్కొనబడిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీక్ షఫిక్ సయ్యద్ లను దోషులుగా ప్రకటించింది. మిగిలిన ముగ్గురు దోషులని నిరూపించేందుకు బలమైన ఆధారాలు లేకపోవడం వలన వారిని నిర్ధోషులుగా భావించి విడుదల చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. దోషులుగా పేర్కొనబడిన ఇద్దరికీ వచ్చే సోమవారం శిక్షలు ఖరారు చేస్తామని న్యాయస్థానం ప్రకటించింది. ఈ కేసుల తీవ్రత దృష్ట్యా చర్లపల్లి జైలులోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక న్యాయస్థానం అక్కడే నిందితులను విచారించి ఈ తీర్పు వెలువరించింది.
2007, ఆగస్ట్ 25వ తేదీన జరిగిన జంట ప్రేలుళ్ళలో మొత్తం 43 మంది చనిపోగా, 68 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఈ కేసుపై దర్యాప్తు, కోర్టు విచారణ కొనసాగి చివరికి నేడు ఇద్దరిని దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది. ఈ కుట్రకు ప్రధానసూత్రధారులైన అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ ముగ్గురు పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నారు.