ప్రతిపక్షాలకు కూడా సంతోషం కలిగించిన నివేదన సభ!

ప్రగతి నివేదన సభ విజయవంతం అయినందుకు టిఆర్ఎస్‌ శ్రేణులు సంతోషించడం సహజమే కానీ ప్రతిపక్షాలు కూడా సంతోషిస్తున్నాయి. సిఎం కెసిఆర్‌ పిలుపుతో కొంగరకలాన్ లో నిన్న జరిగిన సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేశారని టిఆర్ఎస్‌ నేతలు చెప్పుకొని సంతోషపడుతుంటే, ఆ సభకు కనీసం 5 లక్షల మంది కూడా రాలేదని, ప్రగతి నివేదన సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని కాంగ్రెస్‌, బిజెపి, టిడిపి నేతలు వాదిస్తున్నారు. కనుక సంతోషించడానికి అందరికీ ఒక బలమైన కారణం ఉంది. టిఆర్ఎస్‌ సభకు ఆశించిన స్థాయిలో ప్రజలు తరలిరాకపోవడంతో అందరి కంటే ఎక్కువగా కాంగ్రెస్‌ నేతలు చాలా సంతోషిస్తున్నట్లున్నారు. 

ప్రగతి నివేదన సభకు ఆశించిన స్థాయిలో భారీగా ప్రజలు రాకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కారణాలు ఏవైనప్పటికీ చాలా ఆర్భాటంగా నిర్వహించిన ఆ సభకు ఆశించినదానిలో కనీసం సగం మంది కూడా రాకపోవడం టిఆర్ఎస్‌ను కలవరపరిచే విషయమే. ఆ సభకు కనీసం 25-30 లక్షల మంది వస్తారని అనవసరంగా గొప్పలు చెప్పుకొన్న కారణంగా టిఆర్ఎస్‌ ఇప్పుడు ప్రతిపక్షాలకు చులకనయ్యింది. అందుకే ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా ఆ సభ గురించి గట్టిగా మాట్లాడుతున్నాయి. 

“కెసిఆర్‌ సాగిస్తున్న నిరంకుశ, అవినీతి పాలనతో విసిగిపోయున్న ప్రజలు టిఆర్ఎస్‌ ఎంత డబ్బు వెదజల్లినప్పటికీ సభకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. ఆ సభకు ఖర్చు పెట్టిన డబ్బుతో హైదరాబాద్‌ రోడ్లు మరమత్తులు చేయించవచ్చు. రైతుల సమస్యలు తీర్చవచ్చు. కానీ అవేమీ పట్టించుకోకుండా సిఎం కెసిఆర్‌ వందల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు,” అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు.     

కాంగ్రెస్‌ నేత డికె అరుణ మాట్లాడుతూ, “వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన ఆ సభ ద్వారా సిఎం కెసిఆర్‌ రాష్ట్ర ప్రజలకు కొత్తగా ఏమి చెప్పారు? సభకు హాజరైన వారందరూ టిఆర్ఎస్‌ ఏర్పాటు చేసిన వాహనాలలో ఏదో విహారయాత్రకు వెళుతున్నట్లు వెళ్ళి వచ్చారు. ముందస్తు ఎన్నికలకు ముందు నవంబరులో రైతులకు మళ్ళీ చెక్కులు పంచిపెట్టి ఓట్లు దండుకోవాలనుకొంటున్నట్లు నిన్నటి సభలో స్పష్టం అయ్యింది,” అని విమర్శించారు.